
ములుగు, వెలుగు : మత్తుపదార్థాలు, మాదకద్రవ్యాల నిరోధానికి ఆయా శాఖల అధికారులు కలిసికట్టుగా కృషి చేయాలని, ఎవరైనా మత్తు పదార్థాలు వినియోగిస్తే 1908 కు సమాచారం ఇవ్వాలని ములుగు కలెక్టర్ దివాకర సూచించారు. శుక్రవారం కలెక్టర్ చాంబర్ లో జిల్లాస్థాయి మాదకద్రవ్యాల నిరోధక కమిటీతో సమావేశమయ్యారు. మాదకద్రవ్యాల వినియోగం, రవాణా తదితర అంశాలపై చర్చించి, నియంత్రణ చర్యల గురించి పలు నిర్ణయాలు తీసుకున్నారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఇతర రాష్ట్ర సరిహద్దు ద్వారా వీటిని రవాణా చేసే అవకాశాలు ఉన్నందున అధికారులు అవసరమైన చర్యలు చేపట్టాలని, తనిఖీ కేంద్రాల వద్ద గట్టి నిఘా ఉంచాలన్నారు. మత్తు పదార్థాల నిరోధానికి సమన్వయంతో ముందుకెళ్లాలని సూచించారు. సమావేశంలో ఆర్డీవో వెంకటేశ్, డీసీఆర్బీ డీఎస్పీ కిషోర్ కుమార్, అసిస్టెంట్ కమిషనర్ పోలీస్ (నార్కోటిక్స్) సైదులు, ఎక్సయిజ్, ప్రోబేషన్ అధికారి శ్రీనివాస్, వ్యవసాయ శాఖ అధికారి సురేష్ కుమార్, జిల్లా రవాణా శాఖ అధికారి శ్రీనివాస్ తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.
నిబంధనల ప్రకారం కొనుగోళ్లు చేపట్టాలి..
జిల్లాలో పండించిన నాణ్యమైన ప్రతి గింజను ప్రభుత్వ నిబంధనల ప్రకారం పక్కాగా కొనుగోలు చేయాలని కలెక్టర్ దివాకర అన్నారు. కలెక్టరేట్లో అడిషనల్ కలెక్టర్ సీహెచ్.మహేందర్ జీతో కలిసి ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వాహకులకు శిక్షణ, అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో సుమారు 92,113 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలే లక్ష్యంగా 145 కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు.
ప్రతి కొనుగోలు కేంద్రం పరిధిలో ఉన్న రైతుల వివరాలు, రైతులు సాగు చేసిన భూ విస్తీర్ణం వివరాలు, వచ్చే పంట దిగుబడి వివరాలు ముందస్తుగా తెలుసుకోవాలని, షెడ్యూల్ ప్రకారం నాణ్యమైన ధాన్యాన్ని రైతులు కొనుగోలు కేంద్రాలకు తీసుకుని వచ్చే విధంగా చూడాలని సూచించారు. సమావేశంలో అడిషనల్ ఎస్పీ సదానందం, జీసీసీ డీఎం ప్రతాప్ రెడ్డి, జిల్లా పౌర సరఫరాల అధికారి షా ఫైజల్ హుస్సేని తదితరులు పాల్గొన్నారు.